ఆంధప్రదేశ్ ప్రజలకు, రైతులకు ఐఎండీ (భారత వాతావరణ శాఖ) తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంపై ముందస్తు అంచనాలను విడుదల చేసింది. రాష్ట్రంలో సాధారణానికి మించి అధికంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎండలు, వేడి గాలులతో అల్లాడుతున్న ప్రజలకు ఐఎండీ చెప్పిన కబురు ఊరట కలిగించింది. గతేడాది ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో పెద్దగా వర్షాలు కురవలేదు. ఈ ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి.. రానున్న నైరుతి సీజన్‌లో రాష్ట్రంలో సాధారణంకంటే అధిక వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్ స్టెల్లా తెలిపారు. ఈ వానలు పంటలకు ఎంతో మేలు చేయనున్నాయి.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగమనం ఎప్పుడనే విషయమై మే నెల మధ్య నాటికి స్పష్టత రానుంది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. గత ఏడాది ఎనిమిది రోజులు ఆలస్యంగా జూన్ ఎనిమిదిన కేరళను తాకిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలకు మెల్లిగా విస్తరించాయి. దీంతో వర్షాలు సకాలంలో కురవకపోవడమే కాదు.. సమృద్ధిగాను కురవలేదు. నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్ నుంచి సెప్టెంబరు)లో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందని వాతావరణశాఖ తెలిపింది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, వేడి గాలులు కొనసాగుతున్నాయి. పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40–44 డిగ్రీల వరకు నమోదయ్యాయి. 38 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 75 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. రానున్న మూడురోజులు ఇవి మరింతగా ప్రభావం చూపనున్నాయి. కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నాయి. మంగళవారం 63 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 130 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే బుధవారం 38 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 135 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణసంస్థ తెలిపింది.