కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో ఆరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఆస్పత్రి చరిత్రలోనే తొలిసారిగా స్కోరింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ నిర్వహించారు. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటూ, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 68 ఏళ్ల వ్యక్తికి ఈ స్కోరింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ నిర్వహించారు.
కర్నూలు జిల్లాలోని కొండాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి, 68 ఏళ్ల వయసున్న ఓంకారం సత్యనారాయణ రాజు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి. అయితే సత్యనారాయణరాజు గుండె కండరాలకు తగినంతగా ఆక్సిజన్‌తో కూడిన రక్తసరఫరా అందకపోవడంతో పాటు విపరీతంగా ఆయాసం వస్తుండేది. దీంతో వైద్యులను సంప్రదిస్తే 2డీ ఎకో చేశారు. ఈ పరీక్షలో గుండె నుంచి రక్త సరఫరా తగ్గిందని తేలింది. అనంతరం యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు.. ఎడమవైపు గుండె రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోయి, రెండు బ్లాక్‌లు ఏర్పడినట్లు గుర్తించారు. ఆపరేషన్ చేద్దామంటే మూత్రపిండాల వ్యాధి కావటంతో పెర్క్యుటేనియస్ ట్రాన్స్‌లుమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ ఆస్పత్రులు అంగీకరించలేదు.
దీంతో కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు స్కోరింగ్ బెలూన్ యాంజియోప్లాస్టీ నిర్వహించారు. తొలుత డయాలసిస్ చేసిన ఆస్పత్రి వైద్యులు.. ఆ తర్వాత స్కోరింగ్ బెలూన్ అనే ఒక రకం ప్రత్యేకమైన బెలూన్‌తో ఆయనకు పీటీసీఏ చేశారు. ఈ బెలూన్ ఎడమవైపు గుండె రక్తనాళాల్లో పేరుకున్న కాల్షియంను పూర్తిగా తొలగించింది. అనంతరం రెండు స్టంట్లు వేసిన వైద్యులు సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో ఈ రకమైన చికిత్స చేయడం ఇదే తొలిసారని చెప్పిన ఆస్పత్రి వర్గాలు.. ఎంప్లాయీస్ హెల్త్ స్కీంలో పూర్తి ఉచితంగా చేసినట్లు వివరించారు.