ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నేత బొండా ఉమాను ఇరికించే ప్రయత్నం జరుగుతోంది: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 17, 2024, 09:04 PM

ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని.. సీఎంపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సింపతీ డ్రామాలతో వైఎస్సార్‌సీపీ అభాసుపాలయ్యింది అన్నారు. హత్యాయత్నం అంటూ తెలుగుదేశం పార్టీపై బురద వేయాలని చేసిన ప్రయత్నాలను ప్రజలు ఛీ కొట్టడంతో ఆ పార్టీ పీకల్లోతు బురదలో కూరుకుపోయిందన్నారు. నాలుగు రోజులు గడుస్తున్నా దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేకపోయారన్నారు. వీళ్లే నిందితులు అంటూ వడ్డెర కాలనీకి చెందిన యువకులను, మైనర్లను పోలీసులు తీసుకుపోయారన్నారు. దీనిపై ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయన్నారు.


ఈ ఘటనలో అసలు రాయి విసిరింది ఎవరు..కారణాలు ఏంటి..వాస్తవాలు ఏమిటో చెప్పకుండా మళ్లీ కుట్రలకు ప్రభుత్వం నీచపు ప్రయత్నాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పడం కోసం, నమ్మించడం కోసం పోలీసు శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తోందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను, టీడీపీ ముఖ్యనేతలను ఎలాగైనా కేసుల్లో ఇరికించాలనే పన్నాగంతో పావులు కదుపుతోందన్నారు. దీనికోసం నిందితులకు టీడీపీ నేతలతో సంబంధాలున్నట్లు చిత్రీకరించేలా విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు. దీనిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను కేసులో ఇరికించేందుకు వైఎస్సార్‌సీపీ కుట్రలు చేస్తోందన్నారు.


కీలకమైన ఎన్నికల సమయంలో బోండా ఉమా ఎన్నికల ప్రచారాన్ని తప్పుడు కేసులతో అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వ చర్యలను, కొందరు అధికారుల చట్ట వ్యతిరేక పోకడలను సహించే ప్రసక్తే లేదన్నారు. మళ్లీ స్పష్టంగా చెబుతున్నాం.. అధికార పార్టీ ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లోనై బోండా ఉమాపై తప్పుడు కేసులు పెట్టినా, తప్పు చేసినా.. జూన్ 4వ తేదీ తర్వాత ఏర్పడే కూటమి ప్రభుత్వంలో చాలా కఠినంగా శిక్షించబడతారన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎన్నికల సంఘం కూడా అధికార దుర్వినియోగంపై దృష్టి పెట్టాలని కోరారు. సీఎంకు భద్రతను కల్పించడంలో విఫలమైన అధికారులను విచారణా బాధ్యతల నుండి తప్పించి కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణతో వేరే అధికారులతో సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.


సానుభూతి కోసం చేసిన గులకరాయి డ్రామాలో బీసీ బిడ్డను బలిచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. గతంలో కోడికత్తి డ్రామాలో ఒక దళిత బిడ్డను ఐదేళ్ల పాటు జైలుపాలు చేశారని.. ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన సతీష్ అనే అమాయకపు యువకుడిని ఇరికిస్తున్నారన్నారు. డబ్బులిస్తామని తీసుకెళ్లారని.. మాట తప్పి మడమ తిప్పి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారన్నారు. ఎర్రని ఎండలో రోజంతా తిప్పారని.. జే-బ్రాండ్ మద్యం పోసి మతి భ్రమించేలా చేశారన్నారు. కోడికత్తి డ్రామా సమయంలో అధికారంలో ఉన్నవారే బాధ్యత వహించాలన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వారే కాబట్టి.. బాధ్యత వహించాల్సింది వారేనన్నారు. కానీ ప్రతిపక్షాలపై నెట్టేయాలనుకోవడానికి సిగ్గుపడాలన్నారు.


ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలకు మీరు చేస్తున్న మోసం, దగా, వంచనకు వైఎస్సార్‌సీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలంతా సిద్ధమైపోయారన్నారు. ప్రజల్లో మొదలైన తిరుగుబాటుతో వైఎస్సార్‌సీపీ నేతల్లో అసహనం పెరిగిపోతోందన్నారు. దాన్ని తెలుగుదేశం పార్టీపై చూపుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని.. జగన్ రెడ్డిలో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని.. రాజకీయాలకు బదులు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లి ఉంటే దేశం గర్వించే మంచి నటుడు అయ్యేవారన్నారు. చిన్న గులకరాయి తగిలితే ఏదో జరిగిపోయిందంటూ డ్రామాలాడుతున్నారని.. కిరాయి ఇస్తామని ఇవ్వకపోవడంతో గులకరాయి విసిరితే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. 24 క్లెమోర్ బాంబులు పేలి 15 అడుగుల మేర ఎగిరి పడిన వ్యక్తి కూడా ఏ రోజూ సానుభూతి కోసం ప్రయత్నించలేదన్నారు. కానీ, గులకరాయి తగిలితే సానుభూతి డ్రామాలు ఆడటానికి సిగ్గనిపించడం లేదా?.. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. ఇప్పటికైనా డ్రామాలకు బీసీలను బలివ్వాలనే ఆలోచన మానుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com