ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీల్లో చేరికలు సర్వ సాధారణంగా జరుగుతుంటాయి.. కానీ అనకాపల్లిలో మాత్రం అలాకాదు.. రాజకీయం కాస్త భిన్నంగా ఉంది. అన్న జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుంటే.. తమ్ముడు మాత్రం కాస్త విచిత్రంగా రెండు రోజుల క్రితం తెలుగు దేశం పార్టీలో చేరారు.
మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతల్ని కలుపుకుని ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. అనకాపల్లి టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కూడా కొణతాలతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విచిత్రంగా కొణాతాల రామకృష్ణ సోదరుడు కొణతాల రఘునాథ్ తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఓ వైపు అన్న కొణాతాల రామకృష్ణ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తుంటే.. తమ్ముడు ఇలా అనూహ్యంగా మిత్రపక్షమైన టీడీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది.
కొణతాల రఘునాథ్ 2014 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి పీలా గోవింద్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత గోవింద్, రఘునాథ్ వియ్యంకులయ్యారు.. 2019 ఎన్నికల నుంచి రఘునాథ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు అనూహ్యంగా వెళ్లి టీడీపీలో చేరారు. కొణతాల బ్రదర్స్ మొత్తం ముగ్గురు కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో ఉంటే.. రఘునాథ్ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక మిగిలిన సోదరుడు లక్ష్మీనారాయణ బీజేపీలో చేరతారేమోనని కొందరు సెటైర్లు పేలుస్తున్నారు.
మరోవైపు రెండు నెలల క్రితం రఘునాథ్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిశారు. అనకాపల్లిలో సుమారు 1000 మంది యువత కు ఉపాధి కల్పన కోసం తాను తలపెట్టిన ఆలోచనలు తెలియజేశారు. యువతకు మంచి జరిగే ఎటువంటి కార్యక్రమానికైనా తమ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు టీడీపీలో చేరతారని ప్రచారం జరగ్గా.. ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీలో చేరి ట్విస్ట్ ఇచ్చారు రఘునాథ్.
అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అనకాపల్లి ఎంపీగా బీజేపీ నుంచి సీఎం రమేష్ పోటీకి దిగారు. గెలుపే లక్ష్యంగా అక్కడ కూటమి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.