ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు సుమారుగా 45 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. మండే ఎండలకు తోడు వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఏపీవ్యాప్తంగా గురువారం 76 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 214 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.అలాగే శుక్రవారం కూడా 47 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 229 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
గురువారం వడగాల్పులు వీచే జిల్లాలు. మండలాల సంఖ్య
విజయనగరం జిల్లా - 22 మండలాలు
పార్వతీపురం జిల్లా - 13 మండలాలు
శ్రీకాకుళం జిల్లా - 12 మండలాలు
అనకాపల్లి జిల్లా - 11 మండలాలు
పల్నాడు జిల్లా -7 మండలాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా - 4 మండలాలు
కాకినాడ జిల్లా - 3 మండలాలు
తూర్పుగోదావరి జిల్లా - 2 మండలాలు
ఎన్టీఆర్ జిల్లా - 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నేపథ్యంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ వీలైతే ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏపీలో బుధవారం దంచికొట్టిన ఎండలు
ఏపీవ్యాప్తంగా బుధవారం భానుడి ప్రతాపం చూపించాడు. నంద్యాల జిల్లా పెద్ద దేవళాపురంలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, వైయస్సార్ జిల్లా సింహాద్రిపురంలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లా రావికమతం, విజయనగరం జిల్లా రామభద్రాపురం, తిరుపతి జిల్లా మంగనెల్లూరు, ప్రకాశం జిల్లా దొనకొండలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.