ఏపీలో ప్రభుత్వ సలహాదారులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రికి వర్తించే ఎన్నికల ప్రవర్తనా నియమావళే ప్రభుత్వ సలహాదారులకు వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుంచి జీతభత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది సలహాదారులకు ఇది వర్తిస్తుందని ఆదేశాలనిచ్చింది. ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు అందాయని అందులో పేర్కొంది.
నిర్దేశిత పనికి బదులు రాజకీయ ప్రచారంలోకి వస్తున్నారని.. ప్రతిపక్షాలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను నిర్వహిస్తున్నారని గుర్తించినట్లు ఈసీ వివరించింది. మంత్రుల మాదిరే వీరికి కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాలకు లోబడి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. నిర్దేశిత పనికి బదులుగా, వారు రాజకీయ ప్రచార రంగంలోకి ప్రవేశిస్తున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతంలో పలు సందర్భాల్లో ప్రింట్ మీడియాలో అభ్యంతరకరమైన మరియు తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటివల్ల ప్రభావితమయ్యే అభ్యర్థులు మరియు పార్టీలకు అటువంటి సందర్భాలలో వివరణ/ఖండన అందించే సమయం కూడా ఉండనందున ఎన్నికల చివరి దశలో ఇటువంటి ప్రకటనలు మొత్తం ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ గుర్తించిందన్నారు.
అటువంటి ఉదంతాలు పునరావృతం కాకుండా, ఎన్నికల సందర్భంగా ఆవేశపూరితమైన, తప్పుదోవ పట్టించే లేదా ద్వేషపూరిత ప్రకటనల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం తనకున్న అధికారాలను మరియు దానికి వీలు కల్పించే అన్ని ఇతర అధికారాలను ఉపయోగించుకుని తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా రాజకీయ ప్రకటనలలోని విషయాలు రాష్ట్ర/జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ కమిటీ వారి నుంచి ముందస్తుగా ధృవీకరించబడినట్లయితే తప్ప, ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి లేదా మరే ఇతర సంస్థ లేదా వ్యక్తి పోలింగ్ రోజున మరియు పోలింగ్ కు ఒక రోజు ముందు ప్రింట్ మీడియాలో ఎలాంటి ప్రకటనను ప్రచురించకూడదని స్పష్టం చేశారు.
వార్తాపత్రిక ప్రకటనల ముందస్తు ధృవీకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి, రాష్ట్ర/జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ కమిటీలను అప్రమత్తం చేయటం జరిగిందని, రాజకీయపార్టీలు, అభ్యర్థులు, ఇతర సంస్థల నుండి అందిన అటువంటి ప్రకటనలన్నింటినీ కమిటీలు త్వరితగతిన పరిశీలించి, ముందస్తుగా ధృవీకరిస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వార్తాపత్రికలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ ప్రకటనల విషయంలో రాష్ట్ర/జిల్లా స్థాయిలో ఎంసీఎంసీ కమిటీ ల నుండి ముందస్తుగా అనుమతి తీసుకున్న తరువాత మాత్రమే ప్రింట్ మీడియాలో ప్రకటనలు ప్రచురించి ఎలక్షన్ కమిషన్ కు సహకరించాలని విజయ్ కుమార్ రెడ్డి కోరారు.