ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ హజారే ట్రోఫీలో అపశ్రుతి.. ముంబై బ్యాటర్‌ అంగ్‌క్రిష్ రఘువంశీ తలకు గాయం

sports |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 11:41 PM

విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో అపశ్రుతి చోటు చేసుకుంది. జైపూర్ సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో ముంబై, ఉత్తరాఖండ్ మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో 21 ఏళ్ల ముంబై బ్యాటర్‌ అంగ్‌క్రిష్ రఘువంశీ తలకు తీవ్రమైన గాయం అయింది. వెంటనే అతడిని మైదానం వెలుపలికి తీసుకువచ్చి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, స్ట్రెచర్‌పై అంగ్‌క్రిష్ రఘువంశీని గ్రౌండ్ బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


 ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లోని 30వ ఓవ‌ర్‌లో ఆఫ్ స్పిన్నర్ తనుష్ కోటియన్ బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాటర్ సౌరభ్ రావత్ స్లాగ్-స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఆ షాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని.. డీప్ మిడ్-వికెట్ వైపు పయణించింది. అక్కడ రఘువంశీ క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. అందుకోసం ఒక చేతితో డైవింగ్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి గ్రౌండ్‌పై పడ్డాడు. దీంతో అతడి తల బలంగా గ్రౌండ్‌కు తాకింది. రఘువంశీ భుజాలు, మెడకు కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయం తర్వాత తనకు తానే లేచాడు. ఆ వెంటనే మళ్లీ పడిపోయాడు.


మెడికల్ స్టాఫ్ హుటాహుటి అక్కడి వెళ్లి.. రఘువంశీ మెడ కదపడంలో తీవ్ర ఇబ్బందులు పడడంతో స్ట్రెచర్‌పై అంబులెన్స్ దగ్గరికి తరిలించారు. అనంతరం జైపూర్‌లోని SDMH ఆసుపత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, రఘువంశీకి పలు వైద్య పరీక్షలు చేసినట్లు.. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గాయంతో రఘువంశీ ఇబ్బంది పడుతుంటే.. స్ట్రెచర్, అంబులెన్స్ అరేంజ్ చేయడంలో జాప్యం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా, అంగ్‌క్రిష్ రఘువంశీ గాయంపై నిర్వాహకులు అధికారికంగా స్పందించలేదు.


అంతకుముందు రఘువంశీ ముంబై తరఫున ఓపెనర్‌గా దిగాడు. 11 బంతుల్లో 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక మొదటి మ్యాచ్‌లో 155 అజేయ సెంచరీ చేసిన టీమిండియా స్టార్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే ప్రారంభంలో వికెట్లు పోయినా.. ముషీర్ ఖాన్ (55), సర్ఫరాజ్ ఖాన్ (55), వికెట్ కీపర్ హార్దిక్ తామోర్ 93 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను గట్టెక్కించారు. కెప్టెన్ శార్దుల్ ఠాకూర్, షామ్స్ ములానీ కూడా రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది ముంబై. కాగా, విజయ్ హజారే ట్రోఫీ మొదటి మ్యాచ్‌లో 38 పరుగులు చేసిన అంగ్‌క్రిష్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa