టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు విశేషంగా విచ్చేసే వేలాది మంది భక్తులకు నిరంతరాయంగా రుచికరమైన అన్నప్రసాదాలను టీటీడీ అందిస్తోంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, మజ్జిగ అందిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎండ వేడిమి నుండి భక్తులకు ఇబ్బంది లేకుండా జర్మన్ షెడ్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి రోజు ఉదయం 7 గంటలకు అల్పాహారం, ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు మరల సాయంత్రం 6.30 నుండి రాత్రి 7 గంటల వరకు రుచికరమైన అన్నం, సాంబారు, రసం, మజ్జిగ, పచ్చడి, కర్రీ, బెల్లం పొంగలి అందిస్తారు. ఇందుకోసం దాదాపు 50 మంది టీటీడీ అన్నప్రసాదం విభాగం సిబ్బంది పనిచేస్తున్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ 17 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఏకశిలానగరం ముస్తాబైంది. ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు చేపట్టారు. బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి.
ఈ నెల 17న ఉదయం ఉదయం – ధ్వజారోహణం(మిథున లగ్నం), సాయంత్రం – శేష వాహనం. ఈ నెల 18న ఉదయం – వేణుగానాలంకారము, సాయంత్రం – హంస వాహనం. ఈ నెల 19న ఉదయం – వటపత్రశాయి అలంకారము, సాయంత్రం – సింహ వాహన సేవ నిర్వహిస్తారు. ఈ నెల 20న ఉదయం – నవనీత కృష్ణాలంకారము, సాయంత్రం – హనుమత్సేవ. ఈ నెల 21న ఉదయం – మోహినీ అలంకారము, సాయంత్రం – గరుడసేవ. ఈ నెల 22న ఉదయం – శివధనుర్భంగాలంకారము, సాయంత్రం – కళ్యాణోత్సవము/ గజవాహనంపై స్వామి దర్శనమిస్తారు. ఈ నెల 23న ఉదయం రథోత్సవం నిర్వహిస్తారు. ఈ నెల 24న ఉదయం – కాళీయమర్ధనాలంకారము, సాయంత్రం – అశ్వవాహనం. ఈ నెల 25న ఉదయం – చక్రస్నానం, సాయంత్రం – ధ్వజావరోహణం. ఈ నెల 26న సాయంత్రం – పుష్పయాగం నిర్వహిస్తారు.
రాములవారి కల్యాణోత్సవం ఏర్పాట్లు పరిశీలన
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం రోజున భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లను టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ కలిసి బుధవారం పరిశీలించారు. కల్యాణ వేదిక వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్యాలరీల్లో భక్తులకు కల్పించాల్సిన వసతులు ఇతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు.
కడప జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుని పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పటిష్ట బందోబస్తు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా, వాహనాల పార్కింగ్, భక్తుల అవసరాలకు తగినన్ని ఆర్ టిసి బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కళ్యాణ వేదిక వద్ద బారికేడ్లు, అన్న ప్రసాదము కౌంటర్లు, లైటింగ్, వైద్యశిబిరాలు, మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ధ్య సిబ్బంది తదితర అంశాలపై సమీక్షించారు. అంతకుముందు ఒంటిమిట్ట ఆలయం వద్దగల పరిపాలన భవనంలో జేఈవో టీటీడీ, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఒంటిమిట్ట శ్రీ రాములవారి కల్యాణానికి తలంబ్రాల తయారీ ప్రారంభం
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 22న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో బుధవారం తలంబ్రాల ప్యాకింగ్‌ను జేఈవో వీరబ్రహ్మం పరిశీలించారు. శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ కార్యక్రమం శ్రీవారి సేవకులతో ప్రారంభించినట్లు తెలిపారు జేఈవో. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చారన్నారు.
శ్రీ సీతా రామ కళ్యాణం కోసం తలంబ్రాల తయారీకి అవసరమయ్యే పసుపు వినియోగించేందుకు ఏప్రిల్ 13న పుసుపు దంచే కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. కడప, అన్నమయ్య జిల్లాలతో పాటు కర్నూలు, రాజమండ్రి నుండే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు శ్రీవారి సేవకులు వచ్చినట్లు ఆయన తెలిపారు. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 1.20 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa