విశాఖ పరిపాలన రాజధానికి సీఎం వైయస్ జగన్ కట్టుబడి ఉన్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచిన తరువాత విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం వైయస్ జగన్ నిర్ణయాలు ఉత్తరాంధ్ర అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. చంద్రబాబు ఏనాడూ ఉత్తరాంధ్రను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి అనుకూలమా..? వ్యతిరేకమా..?. స్పష్టంగా చెప్పాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పని మనిషని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన మాట చెబితే దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంత కష్టాన్నైనా భరిస్తారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, దానిని నెరవేర్చాలనే మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డగా ఆయన నైజం అది. అలాంటి నేపథ్యంలోనే కిందటి సారి విశాఖపట్టణంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ఓ మాట చెప్పారు. దేవుడి దయతో రాష్ట్ర ప్రజల సహకారంతో మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం. 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖపట్టణంలోనే చేస్తాను. విశాఖను ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా తీర్చిదిద్దడమే కాకుండా ఇక్కడ అన్ని మౌలికసదుపాయాలను కల్పించి ఒక హబ్‌గా తయారు చేస్తానంటూ మాట ఇచ్చారు. అప్పట్లో ఆ కార్యక్రమానికి విచ్చేసిన ఇన్వెస్టర్లందరికీ విశాఖపట్టణంలో పెట్టుబడులకు ఓ భరోసా కల్పించారు అని అన్నారు.