ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు రెబల్ అభ్యర్థుల తలనొప్పులు తప్పడం లేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఇంటి పోరు తప్పేలా లేదు.. ఆయనపై సొంత భార్య పోటీకి సిద్ధమవుతున్నారు. టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం జరిగింది.. తాను స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య, జెడ్పీటీసీ సభ్యురాలు వాణి అనుచరుల దగ్గర ప్రకటించారు. ఆమె గురువారం జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఈ నెల 22న తాను నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు.
మరోవైపు ఇవాళ ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సమర్పించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. గతంలో దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఉన్నారు.. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. గతేడాది ఏప్రిల్ 19న మూలపేట పోర్టు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి.. సభలో ప్రసంగం అనంతరం నియోజకవర్గ అభ్యర్థిగా దువ్వాడ శ్రీను పేరును ప్రకటించారు. ప్రజలందరూ ఆశీర్వదించాలంటూ కోరారు.
దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తోందని వాణి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దువ్వాడ శ్రీను అభ్యర్థిత్వాన్ని ఆయన భార్య వాణి తీవ్రంగా వ్యతిరేకించారు. టెక్కలి నియోజకవర్గంలో పంచాయతీ వైఎస్ జగన్ దగ్గర జరిగింది. దీంతో దువ్వాడ శ్రీనును పక్కన పెట్టి.. నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు దువ్వాడ వాణికి సీఎం జగన్‌కు అప్పగించారు .
ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో.. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా మళ్లీ దువ్వాడ శ్రీనివాస్‌ను నియమించారు. టెక్కలి ఎమ్మెల్యే టికెట్ సైతం ఆయనకే కేటాయించారు. ఈ నిర్ణయంతో పార్టీ అగ్రనాయకత్వంపై దువ్వాడ వాణి ఆగ్రహంతో ఉన్నారు. శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నాయకులు నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారని తెలుస్తోంది. టెక్కలి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆమె నిర్ణయించారని సమాచారం.
గతంలో ఆ వర్గంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. అటు భార్య, ఇటు భర్త వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతలు దువ్వాడ వాణికి కట్టబెట్టిన సమయంలో... సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా ఆమె బరిలో దిగుతారని స్పష్టం చేశారు. కానీ అనంతరం పార్టీ ఎమ్మెల్యే టికెట్ దువ్వాడ శ్రీనివాస్‌కు కేటాయించారు. దాంతో దువ్వాడ వాణి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అందుకోసం తన వర్గంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.