ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి కేసులో నిందితుడు వేముల సతీష్ కుమార్‌ను పోలీసులు గురువారం (ఏప్రిల్ 18) అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్‌ను ఏ1గా పోలీసులు చేర్చారు. నిందితుడు సతీష్‌ను గురువారం సాయంత్రం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సతీష్ తరఫున న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. గతంలో కోడికత్తి శ్రీను కేసులోనూ నిందితుడి తరఫున వాదించింది లాయర్ సలీమే కావడం గమనార్హం. కోడికత్తి శ్రీనుకు బెయిల్ రావడంతో సలీమ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సతీష్ తరఫున కూడా పోరాటం చేస్తానంటున్నారు సలీమ్. అంతేకాదు, ‘రాయి తగిలితే పెద్ద గాయమవ్వాలి కదా’ అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదంతా వైఎస్ జగన్ రాజకీయ వ్యూహాల్లో భాగమేనని ఆయన వాదిస్తున్నారు.
విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో ఏప్రిల్ 13వ తేదీ రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ కణతకు గురిచూసి రాయితో దాడి చేయడంతో ఆయన కంటి పైభాగంలో తీవ్ర గాయమైంది. అయితే, ప్రజలకు అభివాదం చేస్తూ.. సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మ పైభాగాన గాయమైంది. అదే రాయి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు కూడా తగలడంతో ఆయన కూడా గాయపడ్డారు.
ప్రాథమిక చికిత్స తర్వాత సీఎం జగన్ యాత్ర కొనసాగించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత ఒక్క రోజు విశ్రాంతి తీసుకొని ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. రాయి దాడి ఘటనలో నిందితుడు సతీష్ కుమార్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నెల్లూరు జైలుకు తరలించాల్సిందిగా పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. ఇదిలా ఉండగా.. కిందటిసారి ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు వైఎస్ జగన్‌పై కోడి కత్తి దాడి ఘటన సంచలనం సృష్టించింది. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు వైఎస్ జగన్‌పై రాయి దాడి ఘటన సంచలనంగా మారింది. ఈ రెండు కేసుల్లోనూ నిందితుల తరఫున వాదిస్తోంది ఒకే లాయర్ (సలీం) కావడం చర్చనీయాంశంగా మారింది.