దేశంలోని సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన తొలి దశ పోలింగ్ (ఏప్రిల్ 19) కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈ దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ దశలో పలువురు సెలబ్రిటీలతో పాటు ప్రముఖులు ఆయా ప్రాంతాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక, ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్గే (30) నాగ్‌పూర్‌లోని ఓటు వేశారు. తన కుటుంబంతో కలిసి సమీపంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటువేసిన జ్యోతి ఆమ్గే.. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటుహక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఇది మన కర్తవ్యం అని ఆమె పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమెను చూసేందుకు ఓటర్లు ఎగబడ్డారు. ప్రస్తుతం జ్యోతి ఆమ్గే పోలింగ్ బూత్ వద్ద ఓటేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక, ఆమ్గే ఓటుహక్కును వినియోగించుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆమె ఓటు వేశారు. డిసెంబరు 1993లో మహారాష్ట్రలో జన్మించిన ఆమ్గే.. ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత పొట్టి మహిళ. ఆమె పొడవు రెండు అడుగుల ఏడు అంగుళాలు. ప్రపంచంలో పొట్టి మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. అంతేకాదు, నటి, మోడల్ అయిన జ్యోతి పలు టెలివిజన్ షోలోనూ నటించారు.
ఇక, కొన్ని రాష్ట్రాల్లో అల్లర్ల వంటి చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ అత్యధికంగా త్రిపురలో 68.35 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత బెంగాల్‌లో 64.2 శాతం, మణిపుర్ 63శాతం, మేఘాలయలో 61శాతం, అసోంలో 60 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. తర్వాత తమిళనాడులో 51 శాతం, అత్యల్పంగా బిహార్‌లో 39.78శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ వెల్లడించారు. లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని శాసనసభకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మొత్తం 39 ఎంపీ సీట్లకు ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది.