టీడీపీ అధినేత చంద్రబాబుపై 24 కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2010లో ఆయన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళితే అక్రమంగా ప్రవేశించారని ధర్నాబాద్ పోలీసులు కేసు పెట్టారు. 2012లో ఆళ్లగడ్డ ఉప ఎన్నిక సమయంలో కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదైంది. మంగళగిరిలో సీఐడీ పోలీస్‌స్టేషన్ పరిధిలో 8 కేసులున్నాయి. 2023లో 2, 2022లో 1, 2021లో 3, 2020లో 2 కేసులను సీఐడీ పోలీసులు నమోదు చేశారు. కరోనా రెండో దశలో చంద్రబాబు 440కే వేరియెంట్ గురించి మాట్లాడి ప్రజల్లో భయాందోళన కలిగించారని గుంటూరు టౌన్ అరండల్‌పేట, పల్నాడు జిల్లా నరసరావుపేట టూ టౌన్, కర్నూలు వన్ టౌన్‌లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. అన్నమయ్య జిల్లా ముదివేడు, విజయనగరం జిల్లా నెల్లిమర్ల స్టేషన్లలో హత్యాయత్నం కేసులున్నాయి. ముదివేడు స్టేషన్ పరిధిలో టీడీపీ శ్రేణుల్ని వైసీపీ కార్యకర్తలపై చంద్రబాబు రెచ్చగొట్టి పంపించారని హత్యాయత్నం కేసు నమోదు చేశారు. చంద్రబాబు పేరుతో రూ.4.80 లక్షల చరాస్తులు, రూ.36.31 కోట్ల స్థిరాస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.2,22,500 విలువ చేసే ఓ అంబాసిడర్ కారు ఉంది. ఆయన పేరుతో బంగారం లేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కుమారుడు నారా లోకేశ్‌తో కలిసి రూ.3.48 కోట్ల హౌసింగ్ లోన్ తీసుకున్నారు. అలాగే ఆయన భార్య భువనేశ్వరికి చరాస్తులు రూ.810.37 కోట్లు. స్థిరాస్తులు రూ.85.10 కోట్లు, అప్పులు రూ.6.83 కోట్లు ఉన్నాయి.
![]() |
![]() |