తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ప్రసంగాల్లో వాడిని పెంచారు. గతంలో చంద్రబాబు ప్రసంగాలు సీరియస్‌గా సాగేవి. జనం నుంచి స్పందన కూడా తక్కువగానే ఉండేది. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు సరికొత్తగా కనిపిస్తున్నారు. ట్రెండింగ్ అంశాలను, సినిమా విషయాలను ప్రస్తావిస్తూ సభలకు వచ్చే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో చంద్రబాబు ఉన్నారు. అందుకే చంద్రబాబు నిర్వహిస్తున్న ప్రజాగళం ఎన్నికల ప్రచార సభల్లో కార్యకర్తల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా కేజీఎఫ్ సినిమాల గురించి చంద్రబాబు ప్రస్తావించారు.
దేశవ్యాప్తంగా కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ 2 సినిమాలకు ఎంత పాపులారిటీ వచ్చిందో చెప్పాల్సిన పనిలేదు.ఈ నేపథ్యంలోనే కేజీఎఫ్ పేరును ప్రస్తావిస్తూ నారా చంద్రబాబు నాయుడు.. ప్రత్యర్థి పార్టీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎండల బాదుడు కంటే వైసీపీ బాదుడే ఎక్కువగా ఉందని చంద్రబాబు చమత్కరించారు.
అలాగే కేజీఎఫ్- 1, కేజీఎఫ్- 2 చూడాలంటే కోలార్ గోల్డ్ మైన్స్‌కు వెళ్లాలన్న చంద్రబాబు.. ఏపీలోనూ కేజీఎఫ్ ఉందన్నారు. అయితే కేజీఎఫ్-3 చూడాలంటే మాత్రం సర్వేపల్లికి రావాలంటూ స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి మీద సెటైర్లు వేశారు. కేజీఎఫ్ అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి అంటూ విమర్శలు చేశారు. సర్వేపల్లిలో మైనింగ్ మాఫియాతో కొండలు, గుట్టలు ఏమీ మిగల్లేదంటూ చంద్రబాబు ఆరోపించారు. కాకాణి సహజ వనరులను దోపిడీ చేశారన్న చంద్రబాబు నాయుడు.. తాను దోచిన వనరులే ఆయనను రాజకీయ సమాధి చేస్తాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున మరోసారి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన కాకాణి.. హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. మరోవైపు టీడీపీ నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపుతోంది. 1994, 99 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి టీడీపీ తరుఫున గెలుపొందారు సోమిరెడ్డి. ఆ తర్వాత 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఓడిపోయారు. ఈ సారైనా గెలిచి పరాజయాల పరంపరకు బ్రేక్ వెయ్యాలని సోమిరెడ్డి పట్టుదలతో ఉన్నారు.
![]() |
![]() |