ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున కడప లోక్ సభ అభ్యర్థిగా షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కడప కలెక్టరేట్లో ఆర్వోకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఇక నామినేషన్ దాఖలు సందర్భంగా.. ఎన్నికల అఫిడవిట్లో తనకున్న ఆస్తులు , అప్పులు, కేసుల వివరాలను షర్మిల ప్రస్తావించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం వైఎస్ షర్మిల ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్ షర్మిల తనకు రూ.182.82 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ.9.29 కోట్లు కాగా.. చరాస్తులు రూ.123.26 కోట్లని తెలిపారు. అలాగే తన వద్ద రూ.3.69 కోట్ల విలువైన బంగారు, రూ.4.61 కోట్ల విలువైన జెమ్ స్టోన్స్ ఆభరణాలు ఉన్నట్లు షర్మిల తన ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించారు.
ఇక అప్పుల విషయానికి వస్తే.. తన అన్న, వైఎస్ జగన్ వద్ద రూ.82.58 కోట్లు అప్పు తీసుకున్నట్లు వైఎస్ షర్మిల తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే వైఎస్ జగన్ సతీమణి, తన వదిన వైఎస్ భారతి రెడ్డి వద్ద రూ.19.56 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. ఇక వైఎస్ షర్మిల భర్త.. బ్రదర్ అనికల్ కుమార్.. షర్మిల తల్లి.. తన అత్తగారైన వైఎస్ విజయమ్మ వద్ద 40 లక్షలు అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్లో ఉంది. అలాగే తన వద్ద కూడా బ్రదర్ అనిల్ 30 కోట్ల వరకూ అప్పు తీసుకున్నట్లు షర్మిల తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక తనపై ఎనిమిది కేసులు ఉన్నట్లు షర్మిల ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు.
మరోవైపు కడప ఎంపీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల ప్రధాన ప్రత్యర్థిగా.. వైసీపీ నుంచి ఆమె తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ అయిన వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి ఇక్కడి నుంచి బరిలో నిలవగా.. ఆయనే ఓటమే లక్ష్యంగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. వివేకా హత్యకేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని చట్టసభలకు పంపకూడదనే లక్ష్యంతోనే తాను కడప ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నట్లు షర్మిల ఇప్పటికే పలుసార్లు ప్రస్తావించారు. ఇక వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి మద్దతు కూడా వైఎస్ షర్మిల వైపే ఉంది. శనివారం నాటి నామినేషన్ కార్యక్రమంలో కూడా వైఎస్ షర్మిల వెంట సునీతా ఉన్నారు.
మరోవైపు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. వైఎస్ జగన్ మీద జరిగిన రాయిదాడి ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు చిన్నరాయి తగిలితేనే హత్యాయత్నం అని చెప్తున్న వారు.. వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి చంపితే గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారో చెప్పాలన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మళ్లీ ఎందుకు సీటు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు.