ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం నుంచి రెండు రోజులపాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో పర్యటించనున్నారు. ఎన్డీఏ కూటమి తరపున జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఆదివారం పిఠాపురం నుంచి హెలీ కాఫ్టర్లో నర్సాపురం చేరుకుంటారు. అంబేద్కర్ సెంటర్లో జరగనున్న బహిరంగ సభకు ఆయన హాజరుకానున్నారు. అనంతరం నరసాపురం నుంచి మొగల్తూరు మీదుగా భీమవరం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు భీమవరంలో జరిగే బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించనున్నారు. రాత్రికి పవన్ అక్కడే బస చేస్తారు. కాగా నరసాపురం బహిరంగ సభ విజయవంతం చేయాలని ఆ పార్టీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్, పొత్తూరి రామరాజు, మేకల సతీష్ కూటమి నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం తాడేపల్లి గూడెం ఉంగుటూరులో పవన్ కల్యాణ్ రోడ్ షోలు, బహిరంగ సభలలో పాల్గొననున్నారు. తాడేపల్లిగూడెం బహిరంగ సభ, రూట్ మ్యాప్ తదితర అంశాలపై కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమీక్షించారు. సభకు భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.