పశ్చిమబెంగాల్‌లో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. మమత సర్కారు రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్‌ఎల్‌ఎ్‌సటీ) ద్వారా 2016లో జరిపిన బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేసింది. ఈ తీర్పుతో 25,753 మంది ఉద్యోగాలను కోల్పోయారు. వారి నియామక ప్రక్రియ చెల్లదని జస్టిస్ దేబాంగ్సు బసక్, జస్టిస్ మహ్మద్ షబ్బార్ రషీదీతో కూడిన డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. అంతేకాదు.. అక్రమంగా ఉద్యోగాలు పొందినవారంతా గత ఎనిమిదేళ్లుగా తాము తీసుకున్న జీతాలను వడ్డీతో సహా.. నాలుగు వారాల్లోగా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొంది. వసూలు బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. అలాగే.. ఖాళీ అయిన ఉద్యోగాల భర్తీకి 15 రోజుల్లోగా కొత్తగా నియామక ప్రక్రియ చేపట్టాలని ఆ రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. ఈ స్కామ్‌పై సమగ్ర విచారణ జరిపి 3 నెలల్లో సీబీఐతో తదుపరి విచారణకు ఆదేశాలు జారీచేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన పలువురు అభ్యర్థులు తీర్పు రాగానే కోర్టు వెలుపల పెద్ద ఎత్తున గుమిగూడి హర్షం వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ తీర్పుపై స్పందించారు. బీజేపీ నాయకులు న్యాయవ్యవస్థను, తీర్పులను సైతం ప్రభావితం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై 2022 మేలో సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి బీజేపీలో చేరి, ఇప్పుడు తామ్లుక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయాన్ని ఆమె పరోక్షంగా గుర్తుచేస్తూ.. ఇది ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఒక వ్యక్తి ఇచ్చిన ఆదేశాల ఫలితమని వ్యాఖ్యానించారు. న్యాయదేవత రోదిస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. ఈ తీర్పును తాము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్ల జీతాన్ని నాలుగువారాల్లోగా చెల్లించడం సాధ్యమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.