టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ‘ఓ ఆడబిడ్డ జగ్గంపేటలో నన్ను కలిసినప్పుడు నాకో పెన్ను ఇచ్చింది. ఆ పెన్నుతో నేను సీఎం అయ్యాక డీఎస్సీపై తొలి సంతకం చేయాలని కోరింది. కచ్చితంగా అలాగే చేస్తా’ అని ప్రకటించారు. టీడీపీ వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ప్రజాగళంలో భాగంగా సోమవారం కాకినాడ జిల్లా జగ్గంపేట, విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం భయంకర నేరస్థుల వెళ్లిపోయి నష్టపోతోందన్నారు. జగన్‌లాంటి దుర్మార్గుడు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల గతేంటో అందరూ ఆలోచించాలన్నారు. అసలే కోతి.. ఆపై కళ్లు తాగిన చందాన ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. రా ష్ట్రంలో తానొక్కడే శాశ్వతం అనుకుని జగన్ ప్రవర్తిస్తున్నా డు. సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన చిరంజీవి, డైరెక్టర్ రాజమౌళి వంటివారిని ఇంటికి పిలిచి అవమానించిన నీచుడు. సజ్జల రామకృష్ణారెడ్డి సైతం చిరంజీవిని విమర్శిస్తున్నారు. వీళ్ల బలుపు తగ్గించే అస్త్రం టీడీపీ దగ్గర ఉంది. వైసీపీ దోపిడీ చేయడం తెలిసిన పార్టీ. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం తెలిసిన పార్టీ టీడీపీ. అందుకే జాబు రావాలంటే బాబు రావాలి. కానీ గంజాయి కావాలంటే జగన్ రావాలి. జగన్‌కు ఒకటే చాలెంజ్ చేస్తున్నా. వచ్చే నెల 1న వలంటీర్లను కాకుండా సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటింటికీ నేరుగా నెలకు రూ.4 వేల పింఛను ఇస్తాం. పెంచిన మొత్తం ఏప్రిల్ నుంచే అమలు చేస్తాం. పేదలకు రెండు లేదా మూడు సెంట్ల ఇంటి స్థలం అందిస్తాం. టిడ్కో ఇళ్లను ఉచితంగా పంపిణీ చేస్తాం. 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎందరున్నా ప్రోత్సహిస్తాం. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తాం. టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్థికంగా ఎంత లాభమో మహిళలు లెక్కలు వేసుకోండి. ఇది పరీక్షా సమయం. ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని తెలిపారు.