తనకు ఆడ బిడ్డలు లేరని.. వారిని తన అక్కచెల్లెమ్మలుగా, తన బిడ్డలుగా భావిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తాను మహిళా పక్షపాతిని అని చెప్పారు. మహిళలకు ఆర్ధిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యం కల్పించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలు పెడితే అవహేళన చేశారని పేర్కొన్నారు. బుధవారం నాడు శ్రీకాకుళంలో మహిళా సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. మహిళల కోసం తాను ఎంతో చేశానని చెప్పారు. 30 ఏళ్ల క్రితమే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆలోచించానని చెప్పారు. జగన్ పాలనలో 5 ఏళ్లలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. జగన్ ఒక సైకో అంటూ ఘాటైన వ్యా్ఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాలను తలకిందులు చేసిందన్నారు. ఖర్చులు పెరిగాయని.. దానికి తగ్గ ఆదాయం లేదన్నారు. మే 13న వైసీపీకి దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. మహిళల దెబ్బకు వైసీపీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోవాలన్నారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ఆరోపించారు. జగన్ అమ్ముతున్న మద్యం తాగి ప్రజల ఆరోగ్యం పాడువుతోందన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్.. క్రమంగా మద్యం అమ్మకాలు పెంచుతూ వచ్చాడని చంద్రబాబు విమర్శించారు.