అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. బుధవారం గోపాలపురం మండలం లో విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్న బీజేపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ అభ్యర్థి పూరందేశ్వరికి తెలుగు మహిళలు హారతులు పట్టారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు నియోజవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అక్రమ సంపాదనపై దృష్టి తప్ప, అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆగ్రహించారు. దళిత యువకులకు మృతికి కారణమైన హోం మంత్రి వనితను ప్రజల తిప్పికొట్టాలన్నారు. ఫ్లెక్సీల విషయంలో దళిత యువకుడు బలవన్మరణానికి హోం మంత్రి కారణమయ్యారని మండిపడ్డారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గోపాలపురం నియోజవర్గ పరిధిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న స్మశాన భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న ఎన్డీఏ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అందరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీ నాయకుల ప్రలోభాలకు, బెదిరింపులకు ప్రజలు లొంగవద్దన్నారు.