బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, ఎస్సీ, ఎస్టీ , ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దవుతాయని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రల పట్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ సూచించారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తమ ఓటు హక్కుతో బీజేపీకి గుణపాఠం చెప్పాలన్నారు. భారతదేశం ఏమైపోతుందోనన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోందన్నారు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో బీజేపీ పతనం ప్రారంభమైందని, ఈసారి బీజేపీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమవుతుందని అన్నారు. మేకప్ లేనిదే మోదీ బయటకు రారని, ఆయన మేకప్ ఖర్చురోజుకు రూ.20 వేలు అవుతుందని చింతామోహన్ అన్నారు. రాష్ట్రంలోని టీడీపీ , వైసీపీ పార్టీలు మోదీ, అమిత్ షా జేబులోకి వెళ్లిపోయాయని విమర్శించారు. రాబోయే పదిహేను రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశ ప్రజలు విజ్ఞతతో, వివేకంతో, ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటు వేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూల గాలి వీస్తోందన్నారు.
![]() |
![]() |