కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తోంది. కేంద్ర సహకారం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేశారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర రైల్వే శాఖ ఏపీకి శుభవార్త చెప్పింది. అమరావతి మీదుగా వేసే రైల్వే లైన్ కోసం 77 ఎకరాల భూమి సేకరించడానికి ముందుకు వచ్చింది.
అమరావతి మీదుగా 56.53 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణాన్ని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఎర్రుపాలెం-నంబూరు మధ్య ఈ రైల్వే లైన్‌ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం ఇబ్రహీంపట్నం మండలంలో 77.154 ఎకరాల భూమి సేకరణకు రైల్వే శాఖ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి.. శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిలో భాగంగా రెండు గ్రామాల్లో రైల్వే లైన్‌కు అవసరమైన భూమిని సేకరించనున్నారు.
రైల్వే లైన్ నిర్మాణం కోసం చిలుకూరు గ్రామ పరిధిలో ఉన్న 59 సర్వే నంబర్లలో ఉన్న 26.02 ఎకరాల భూమిని.. అలానే దాములూరు గ్రామ పరిధిలో 22 సర్వే నంబర్లలో ఉన్న 51.134 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ భూసేకరణపై ఎవరికైనా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సరే.. వారు విజయవాడ ఆర్‌డీఓకు లిఖితపూర్వకంగా తమ వాదనలను తెలపవచ్చని సూచించారు.
ఈ భూసేకరణపై ఏవైనా ఆరోపణలు వస్తే.. వాటిపై వాద, ప్రతివాదనలు విన్న తర్వాత.. ఈ అంశంపై అధికారులు తుది నిర్ణయం వెల్లడిస్తారని తెలిపారు. అయితే ఈ రైల్వే లైన్ వల్ల చిలుకూరు, దాములూరు గ్రామాలు మాత్రమే కాక పరిసర ప్రాంతాలకు కూడా కలిసి వస్తుందని.. ఇక్కడ భూముల ధరలు పెరుగుతాయని.. కనెక్టివిటీ పెరిగితే.. ఈ ప్రాంతం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. భూసేకరణ, పరిహారం వంటి అంశాలు పూర్తయితే.. ఈ ప్రాజెక్టు ఒక కొలిక్కి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ రైల్వే లైన్ పనులు మొదలవుతాయని ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa