గాజాపై ఇజ్రాయేల్ దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఆందోలనలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఆందోళనల్లొ పాల్గొంటున్న వందలాది మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. శనివారం కూడా మరో 275 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో గ్రీన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న జిల్ స్టెయిన్ ఉన్నారు. పాలస్తీనియన్లపై నరమేధం కొనసాగిస్తున్న ఇజ్రాయేల్‌తో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక, ప్రతిష్ఠాత్మక హార్వర్ యూనివర్సిటీలో ఆందోళనకారులు.. ఐవీ లీగ్ స్కూల్ వద్ద అమెరికా జాతీయ జెండాను తొలగించి, పాలస్తీనా పతాకాన్ని ఎగురవేశారు. అలాగే, వైట్‌హాస్ కరస్పాండెన్స్ అసోసియేషన్ వార్షికోత్సవ వేదికైన వాషింగ్టన్ హిల్టన్ హోటల్ పైఅంతస్తులోనూ పాలస్తీనా జెండాను వేలాడదీశారు. శనివారం బోస్టన్‌లోని నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన 100 మంది, వాషింగ్టన్ యూనివర్సిటీలో 80 మంది, ఆరిజోనా వర్సిటీలో 72 మంది, ఇండియానా వర్సిటీలో 23 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతవారం లాస్ ఏంజెల్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పాలస్తీనా అనుకూలవాదులు, ఇజ్రాయేల్ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అమెరికా వ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆందోళనలు శాంతియుతంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని అధ్యక్ష భవనం హెచ్చరించింది. ర్యాలీలు యూదు వ్యతిరేకత, ద్వేషపూరిత ప్రసంగాలకు దారితీశాయన్న ఫిర్యాదులు విశ్వవిద్యాలయ నిర్వాహకులకు సవాల్‌గా మారాయి. మరోవైపు, ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఆదివారం మాట్లాడిన జో బైడెన్.. గాజా సరిహద్దు నగరమైన రఫాపై దాడి చేసే అవకాశంపై తన స్పష్టమైన వైఖరిని పునరుద్ఘాటించారు.