మండే ఎండలతో ఏపీ భగభగలాడిపోతోంది. దంచికొడుతున్న ఎండలు, భరించలేని ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది. సోమవారం పలు జిల్లాలలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లా, శ్రీసత్యసాయి జిల్లా, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలలో సోమవారం వర్షం కురుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ జిల్లాలలో అక్కడకక్కడా
తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు మంగళవారం కూడా పలు జిల్లాలలో వర్షం కురుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడా మోస్తారు వర్షం కురుస్తుందని అంచనా వేశారు. పిడుగులు పడే అవకాశం ఉందని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే సోమవారం ఏపీలోని 29 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపారు. శ్రీకాకుళం10, విజయనగరం 13, పార్వతీపురం మన్యం జిల్లాలోని 6 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
మరోవైపు ఏపీలో గత రెండురోజులతో పోలిస్తే పగటి పూట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. శుక్ర,శనివారం రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు మించి పగటి పూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఆదివారం పగటి పూట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయనే చెప్పొచ్చు.ఆదివారం నంద్యాల జిల్లా మహానందిలో 45.8 డిగ్రీలు, కర్నూలు జిల్లా జి. సింగవరంలో 45.6, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 45.5 డిగ్రీలు, ప్రకాశం జిల్లా వెలిగండ్లలో 45.2 డిగ్రీలు నమోదయ్యాయి.