ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ కోర్డు అనుమతి ఇచ్చింది. మే 16 నుంచి జూన్ 1వ తేదీ వరకూ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ జగన్ ఇటీవల సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ సందర్భంగా జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ అభ్యంతరాలు తెలిపింది. దీంతో ఈ పిటిషన్ మీద నాంపల్లిలోని సీబీఐ కోర్టు తీర్పును వాయిదా వేసింది, మంగళవారం మరోసారి వాదనలు విన్న నాంపల్లిలోని సీబీఐ కోర్టు.. వైఎస్ జగన్ విదేశీ పర్యటనలకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని స్పష్టం చేసింది.
సీబీఐ కోర్టు నుంచి అనుమతి రావటంతో మే 16 లేదా మే 17వ తేదీల్లో వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి ఫారిన్ వెళ్లే అవకాశం ఉంది. అనంతరం జూన్ ఒకటో తేదీన తిరిగి రానున్నారు. జూన్ నాలుగో తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల ఫలితాలకు ముందుగానే స్వదేశానికి తిరిగి రావాలని జగన్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో రెండు నెలలపాటు ఎడతెరిపి లేకుండా గడిపిన వైఎస్ జగన్.. కొన్నిరోజులు రాజకీయాలను పక్కనబెట్టి కుటుంబంతో గడిపేందుకు యూరప్ టూర్ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సుయాత్రలతో కుటుంబానికి దూరంగా ఉన్న వైఎస్ జగన్ .. కొన్నిరోజుల పాటు కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారు.