ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ.. ఆ వేడి మాత్రం చల్లారడం లేదు. సోమవారం మధ్యాహ్నం వరకూ ప్రశాంతంగా సాగిన పోలింగ్.. సాయంత్రమయ్యేసరికి పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యంగా పల్నాడు, చంద్రగిరి ప్రాంతాల్లో మంగళవారం కూడా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు జిల్లా కొత్తగణేషునిపాడులో మంగళవారం కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. కొత్తగణేషునిపాడులో సోమవారం సాయంత్రం.. టీడీపీ, వైసీపీ వర్గాలు రెండు గ్రూపులుగా విడిపోయి నాటుబాంబులతో దాడి చేసుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకూ ఈ గొడవలు కొనసాగాయి. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టినప్పటికీ.. సోమవారం రాత్రంతా కొత్తగణేషుడిపాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో వైసీపీ వర్గానికి చెందిన కొంతమంది రాత్రంతా పోలీసుల భద్రత మధ్యన గుడిలోనే ఉన్నట్లు తెలిసింది.
మరోవైపు మంగళవారం ఉదయం వైసీపీ నేతలు కాసు బ్రహ్మానందరెడ్డి, అనిల్ కుమార్ ఘటనాస్థలికి చేరుకోవటంతో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. ప్రత్యర్థి వర్గం వైసీపీ నేతల కాన్వాయిమీద కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి మరోసారి చేయిదాటడంతో కేంద్ర బలగాలు జోక్యం చేసుకున్నాయి. గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం వైసీపీ నేతలను అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పల్నాడులో మరికొన్ని రోజులు ఆంక్షలు కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నారు.
చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
మరోవైపు తిరుపతి జిల్లా చంద్రగిరిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కారు మీద వైసీపీ వర్గాలు దాడి చేశాయి. పద్మావతి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించేందుకు పులివర్తి నాని వెళ్లిన సమయంలో ఆయన కారుమీద దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడిచేసి.. కారును ద్వంసం చేశారు. దాడి నేపథ్యంలో టీడీపీ మహిళా నేతలు యూనివర్సిటీ ఎదుట ఉన్న రహదారిపై బైఠాయించి.. నిరసన వ్యక్తం చేశారు. దాడిలో పులివర్తి నాని సెక్యూరిటీకి గాయాలయ్యాయి.