ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది.. ఓటర్లు సోమవారం అర్థరాత్రి వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం. అక్కడ పవన్‌ను కచ్చితంగా ఓడిస్తానని కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ లీడర్ ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. ఒకవేళ పవన్‌ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని చెప్పారు. అయితే పోలింగ్ ముగియడం.. పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదుకావడంతో జనసైనికులు ఖుషీగా ఉన్నారు. పిఠాపురంలో సాయంత్రం 5 గంటల వరకు 71.3 శాతం పోలింగ్ నమోదైనట్లు చెబుతున్నారు.. ఆ తర్వాత రాత్రి సమయంలో కూడా క్యూ లైన్‌లలో జనాలు బారులు తీరారు.. వారు ఓటు వేసేవరకు పోలింగ్ కొనసాగింది. దీంతో పిఠాపురంలో 80శాతం వరకు నమోదవుతుందని జనసైనికుల ఓ అంచనా. ఈ పరిణామాలన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ ఖాయమని ధీమాతో ఉన్నారు.
ఈ క్రమంలో కొందరు జనసైనికులు ముద్రగడ పద్మనాభంను టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ మొదలు పెట్టారు. 'ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక' అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఆ ఆహ్వానపత్రికలో.. 'అందరికీ నమస్కారం అండి.. నూతన నామకరణ మహోత్సవం.. కాపు సోదర సోదరీమణులందరికి ప్రత్యేక ఆహ్వానం అండి. 2024 జూన్ 4న సాయంత్రం ఆరు గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో.. ఏమండీ మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత, తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్దాయన, అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన. గమనిక మీ ఉప్మాకాఫీలు మీరే తెచ్చుకోవాలండి'అంటూ సెటైర్లు పేల్చారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని.. తన పేరును పద్మనాభం బదులు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. అక్కడితో ఆగకుండా.. పవన్ ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన కాపుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు.నోటికి ఏదొస్తే అది మాట్లాడటం సరికాదని.. పవన్ సినిమాలలో నటించాలని.. రాజకీయాల్లో కాదు అని ఎద్దేవా చేశారు. త్వరలోనే జనసేన పార్టీ ప్యాకప్ కావడం ఖాయమన్నారు. తుని రైలు దహనం ఘటనకు చంద్రబాబు నాయుడు కారణమని.. తనను తీహార్ జైలుకు పంపించాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు ముద్రగడ. పవన్ తనను ఉప్మా, కాఫీ అని తనను అవమానించారన్నారు. చంద్రబాబుకు గతంలో ఇంటి పెంచులు మార్చుకోవడానికి డబ్బులు లేని పరిస్థితినుంచి కోటీశ్వరుడు ఎలా అయ్యారని ప్రశ్నించారు.