ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటన సందర్భంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో శుక్రవారం రాత్రి కలకలం రేగింది. గన్నవరం విమానాశ్రయంలో వైఎస్ జగన్‌కు సమీపంగా వచ్చారంటూ ఓ ఎన్నారై డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే కారణంతో ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన అనారోగ్యంగా ఉందని చెప్పడంతో ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు.
అయితే డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ శనివారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైఎస్ జగన్ అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే తనను కిడ్నాప్ చేశారంటూ లోకేష్ కుమార్ ఆరోపించారు. కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం భద్రతా సిబ్బంది కారణం లేకుండా తనను అరెస్ట్ చేశారని. ఛాతినొప్పి వస్తోందని చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. అమెరికన్ పౌరుడైన తనపట్ల అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించారని.. పోలీసులపై ప్రైవేట్ కేసులు పెట్టి న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
ఇక గన్నవరం విమానాశ్రయంలో ఏం జరిగిందో కూడా డాక్టర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. ఎయిరిండియా విమానంలో ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి అమెరికా వెళ్లేందుకు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లినట్లు లోకేష్ కుమార్ తెలిపారు. టికెట్ ప్రింటింగ్ కోసం ఎయిర్ పోర్టుకు వెళ్లానని.. అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అదుపులోకి తీసుకున్న తర్వాత పలుచోట్ల తిప్పారని.. ఛాతీపై కొట్టారంటూ లోకేష్ కుమార్ ఆరోపించారు. ఈ ఘటనపై అమెరికా రాయబార కార్యాలయంతో పాటుగా, ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌కు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాకు కూడా ఫిర్యాదు చేస్తానని డాక్టర్ లోకేష్ కుమార్ తెలిపారు. డాక్టర్ లోకేష్ కుమార్ వైసీపీ పాలనను విమర్శిస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు చేస్తూ ఉంటారు.