చట్టం ఎవరికి చుట్టం కాదని తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షింపబడతారని చట్టం దృష్టి లో ప్రజలంతా సమానమేనని పల్నాడు అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)జీవీ రమణమూర్తి స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించే అసాంఘిక శక్తులను ఉపేక్షించేది లేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రెంటాల, తుమృకోట, పాలువాయిగేట్, జెట్టిపాలెం, గోలి తదితర గ్రామాల్లో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటి దాకా 34 మందిని అరెస్టు చేశామని మరో 36 మంది కోసం గాలిస్తున్నామని వారందరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆ రోజున జరిగిన సంఘటనలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యామని వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు. రెంటాల గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించగా ముళ్ల పొదల్లో 15 కర్రలు లభ్యమయ్యాయన్నారు. సరైన పత్రా లు లేని 5 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను సీజ్ చేశామన్నారు. కార్డెన్ సెర్చ్ ప్రతి రోజు ఉంటుందని గ్రామీణుల్లో ఽధైర్యం కల్పించడానికి కవాతు నిర్వహిస్తున్నామన్నారు. రెండు, మూడు కేసుల్లో నిందితులుగా ఉంటే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ప్రకటించారు. 10 గ్రామాల్లో చెక్‌పోస్టులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో గురజాల డీఎస్పీ పి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ ఎం ఆంజనేయులు పాల్గొన్నారు.