దేశంలో ప్రస్తుతం ఐదో విడత లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ.. నలుగురు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడటం తీవ్ర సంచలనంగా మారింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో నలుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా వచ్చిన ఇన్‌పుట్‌ల ద్వారా పక్కాగా వల వేసిన గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్-ఏటీఎస్ అధికారులు.. స్పెషల్ ఆపరేషన్ చేపట్టి.. నలుగురు ఉగ్రవాదులను అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుకున్నారు. వీరికి ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేసిన నలుగురు ఉగ్రవాదులు శ్రీలంకకు చెందిన పౌరులు అని అనుమానిస్తున్నారు. ఈ నలుగురు ఉగ్రవాదులు.. శ్రీలంక నుంచి మొదట చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. ఆ తర్వాత అక్కడి నుంచి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినట్లు ప్రాథమిక నిర్ధారించారు. ఈ క్రమంలోనే వారి కదలికలకు సంబంధించిన సమాచారం రావడంతో గుజరాజ్ ఏటీఎస్ అధికారులు వారిని అరెస్ట్ చేశారు.
నలుగురు ఉగ్రవాదులు పట్టుబడటంతో వారి ప్లాన్ ఏంటి అనేది అధికారులు విశ్లేషిస్తున్నారు. అసలు వారు గుజరాత్‌కు ఎందుకు వచ్చారు.. వారు ఏదైనా ఉగ్రదాడికి ప్రయత్నాలు చేస్తున్నారా.. ఆ నలుగురు ఉగ్రవాదులకు గుజరాత్, భారతదేశంలో ఉన్న హ్యాండ్లర్ ఎవరు లాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతకడం కోసం గుజరాత్ ఏటీఎస్ అధికారులు ఆ నలుగురు ఉగ్రవాదులను విచారణ జరుపుతున్నారు.