ఈ నెల 23వ తేదీ రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆ రోజు రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటించింది.తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవచ్చని పేర్కొంది. ఇదే విషయంపై ఐఎండీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దక్షిణ తమిళనాడు జిల్లాలు, వాటిని ఆనుకుని ప్రాంతాలపై బాహ్య ఉపరితల ద్రోణి నెలకొనివుంది. దాని కారణంగా సోమవారం అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. తేని, తెన్‌కాశి, కన్నియాకుమారి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.విరుదునగర్, తిరుపూర్, కోయంబత్తూరు, నీలగిరి, దిండిగల్ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి, రామనాథపురం, మదురై, శివగంగై, తూత్తుక్కుడి, తంజావూరు, తిరువారూర్, మైలాడుదురై, నాగపట్టణం, కడలూరు, అరియలూరు, పెరంబలూరు, తిరుచ్చి, పుదుక్కోట జిల్లాలతో పాటు కారైక్కాల్ ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. చెన్నై, పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, కన్నియాకుమారి సముద్రతీర ప్రాంతం, మన్నార్ జలసంధి, కేరళ పరిసర ప్రాంతాలు, లక్షద్వీ్‌పలో భారీగా ఈదురు గాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. అందువల్ల ఆయా ప్రాంతాలకు చెందిన జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళొదని విజ్ఞప్తి చేసింది.