గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్వవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం గోవిందరాజ స్వామి హనుమంత వాహనంపై మాఢ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లమీదకు వచ్చారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గరుడసేవ నిర్వహించారు. గరుడసేవ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం గరుడవాహనంపై గోవిందరాజ స్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు, గరుడ వాహనంపై నాలుగు మాఢ వీధులలో విహరించిన స్వామివారిని చూసి భక్తులు ఆనంద పరవశులయ్యారు. మరోవైపు గరుడసేవ సందర్భంగా.. ఏనుగులు, గుర్రాలు, నృత్య బృందాలు, కోలాటాలు, కళాకారుల ప్రదర్శనలు ఊరేగింపును మరింతగా వేడుకగా మార్చేశాయి. గోవిందరాజస్వామి గరుడ వాహన సేవను తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. మరోవైపు గోవిందరాజస్వామి గరుడసేవను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి కానుకగా రూ.10 లక్షల విలువైన ఆభరణాలు సమర్పించారు. తన సోదరుడు అయిన గోవిందరాజునికి తిరుమల శ్రీవారు పది లక్షలు విలువచేసే.. మూడు ఆభరణాలు, వజ్రపు పోగులు, లక్ష్మి కాసు మాల, తెల్ల రాళ్ల పతకాన్ని బహుకరించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.