విశాఖపట్నం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాద్రి అప్పన్న ఆలయంలో మూడవ రోజు చందనం అరగదీత కార్యక్రమం జరిగింది. అప్పన్న ఆలయంలో ఉన్న బేడామండపంలో సిబ్బంది రాతి సానలపై చందనం చెక్కలను అరగదీసి శ్రీగంధాన్ని సేకరించారు. సోమవారం 35కిలోల గంధం వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. మొత్తం మూడు రోజుల్లో 112 కిలోల శ్రీగంధం వచ్చింది. ఇవాళ కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుండగా.. సాయంత్రానికి ముగుస్తుంది.
ప్రతి ఏటా చందనోత్సవం సందర్భంగా అప్పన్న ఆలయంలో పరోక్ష విధానంలో భక్తులు అష్టోత్తర శతనామార్చన పూజకు టికెట్లు కొనుగోలు చేస్తారు. ఆ భక్తులకు ప్రసాదం పంపించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. సింహాచలం అప్పన్న భక్తుల పరోక్ష సేవకు 592 మంది భక్తులు నమోదు చేసుకోగా.. వారందరికి పోస్టల్ ద్వారా స్వామివారి నిర్మాల్య చందనం ప్యాకెట్‌తో పాటుగా ఎండు ఫలాలు, అమ్మవారి కుంకుమ పంపిస్తారు.. దీనికి సంబంధించిన పార్సిళ్లను ఆలయ సిబ్బంది రెడీ చేశారు. భక్తులకు పంపించే ఒక్కో పార్సిల్‌కు రూ.29 ఖర్చు చేస్తున్నారు.
మరోవైపు సోమవారం సాయంత్రం అప్పన్న ఆలయానికి.. ఒడిశాలోని బ్రహ్మపురకు చెందిన అప్పన్నస్వామి భక్తుడు లక్ష్మీకాంత నాయకో దాసుడు భక్తులతో కలిసి వచ్చారు. ప్రతి ఏటా ఆయ చందనోత్సవం తర్వాత సింహాచలం వస్తారు.. అక్కడే మూడు నెలలో పాటు అప్పన్న స్వామి సేవలో తరిస్తారు. ముందుగా ఆయన పరివార సమేతంగా అడివివరంలో వరాహ పుష్కరిణి తొలుత దర్శించారు. ఆ తర్వాత తొలిపావంచా దగ్గర స్వామికి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెట్లమార్గంలో సింహగిరికి వచ్చారు.