కడపలో ఆసక్తికర ఘటన జరిగింది. రైలులో పోగొట్టుకున్న విలువైన వస్తువులను రైల్ మదద్ సాయంతో మళ్లీ దొరికాయి. వెంటనే ప్రయాణికుడికి ఫోన్ చేసి సమాచారం అందించి తిరిగి అప్పగించారు. ఈ నెల 18వ తేదీన రాత్రి కర్ణాటకలోని హోస్‌పేటకు చెందిన నీరజ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి రేణిగుంట స్టేషన్‌కు హరిప్రియ ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి వచ్చారు. ఈ కుటుంబం ముందుగా వారి మూడు బ్యాగులను ఏ-1 బోగీలో ఉంచారు. ప్లాట్‌ఫాం మీద ఉన్న మిగతా కుటుంబ సభ్యులను ఎక్కించేందుకు నీరజ్ కుమార్ దిగారు. ఈలోపు ఆ రైలు అక్కడి నుంచి కదిలింది.
నీరజ్ కుమార్ వెంటనే అప్రమత్తం అయ్యారు.. రైల్ మదద్(139)కు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పి వివరాలు ఇచ్చారు. వెంటనే రైల్వే కంట్రోల్ రూం అధికారులు అలర్ట్ అయ్యారు.. వారు కడప ఆర్‌పీఎఫ్ అధికారులకు సమాచారం అందజేశారు. ఈ రైలు కడపకు రాగానే ఆర్‌పీఎఫ్ పోలీసులు ఆ హరిప్రియ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎ-1 కోచ్‌లో ఉన్న బ్యాగులను దించి రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. వెంటనే ఈ సమాచారాన్ని బాధితుడు నీరజ్‌కుమార్‌కు ఫోన్ చేసి తెలపగా.. ఆయన సోమవారం వచ్చి తనకు సంబంధించి ఆధారాలు చూపించడంతో ఆ లగేజీని తిరిగి అప్పగించారు. మొత్తం మూడు బ్యాగుల్లో రూ.1,20,000 డబ్బులతో పాటుగా బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు ఉన్నాయి. తాను రైల్ మదద్ ద్వారా సమాచారం ఇవ్వగానే స్పందించిన కడప ఆర్‌పీఎఫ్ అధికారులకు నీరజ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు.