ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్టు శ్రీకాకుళం జిల్లా, రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ.. ‘పరీక్షలకు జిల్లాలో 23,668 విద్యార్థులు హాజరు కానున్నారు. 51 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశాం. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఇతర సదుపాయాలు కల్పించాలి. మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి. పోలీసు బందోబస్తుతోపాటు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాల’ని ఆదేశించారు. సమావేశంలో ప్రాంతీయ తనిఖీ అధికారి దుర్గారావు, ఒకేషనల్ అధికారి ప్రకాశరావు, డీఈసీ శ్యామ్‌సుందర్, కె.తవిటినాయుడు, జి.సింహాచలం, సమాచార పౌరసంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, డీఈవో వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.