అనకాపల్లి జిల్లా రోలుగుంటలోని సంతబయల వీధిలో ఉంటున్న మడ్డు తమ్మునాయుడు ఇంట్లో కూడా తెలంగాణ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం రెండు బృందాలుగా తెలంగాణ ఏసీబీ అధికారులు గ్రామానికి వచ్చారు. తమ్మునాయుడు గురించి స్థానిక పంచాయతీ కార్యాలయ సిబ్బందిని వాకబు చేశారు. వారి సహాయంలో తమ్మునాయుడు ఇంటికి చేరుకుని మధ్యాహ్నం మూడు గంటల వరకూ సోదాలు చేశారు. ఇంట్లో ఉన్న వారి వివరాలు సేకరించారు. తమ్మునాయుడు కుమారుడు జోగినాయుడు పోలీస్ స్పెషల్ పార్టీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం విశాఖ సింహాచలం దేవస్థానం సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. జోగినాయుడుకు, డీఎస్పీ ఉమామహేశ్వరరావు బంధువులకు సంబంధాలు ఉండడంతో ఏసీబీ సోదాలు చేసినట్టు సమాచారం. సోదాల వివరాలు వెల్లడించడానికి ఏసీబీ అధికారులు నిరాకరించారు.