కమీషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం జగన్ రెడ్డిదేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఆరోగ్యశ్రీలో కూడా జగన్ నాటకాలు ఆడారని విమర్శించారు. ప్రభుత్వం బకాయిలు కట్టకపోవడంతోనే ఆరోగ్య శ్రీ సేవలను ప్రైవేట్ ఆస్పత్రులు నిలిపేశాయని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను జగన్ రెడ్డి దారి మళ్లించారని మండిపడ్డారు. ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా అస్మదీయులకు రూ.15వేల కోట్ల వరకు జగన్ రెడ్డి కట్టబెట్టారని దేవినేని ఉమా ఆరోపించారు. ఓట్ల కోసం డాక్టర్లను వాడుకుని గ్రామాల్లో ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు రాష్ట్రంలో రక్తపాతం సృష్టించారని ఫైర్ అయ్యారు. అరాచకం సృష్టించి బుద్ధి లేకుండా బయటకు వచ్చి వైసీపీ నేతలు జోగి రమేష్, అంబటి రాంబాబు న మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చూడబోతోందన్నారు. ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని దేవినేని ఉమా ధీమా వ్యక్తం చేశారు.