రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై జేపీ వెంచర్స్‌కు ఎన్జీటీ భారీ పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. ట్రైబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టులో జేపీ వెంచర్స్ అప్పీల్‌చేయగా స్టే లభించింది. తాజాగా ఈ కేసు విచారణకొచ్చింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఇదివరకు జేపీ వెంచర్స్, ఇప్పుడు కొత్త కాంట్రాక్టు సంస్థలైన ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీలు కూడా అక్రమ తవ్వకాలు చేస్తున్నాయంటూ గుంటూరుకు చెందిన నాగేంద్రకుమార్ సుప్రీంకోర్టుకు ఆధారాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన కోర్టు.. ఎన్జీటీ ఆదేశాలను ఏపీ సర్కారు, రెండు కాంట్రాక్టు సంస్థలు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ నేపఽథ్యంలో ఎంపిక చేసిన రీచ్‌ల్లో జిల్లా కలెక్టర్లు, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిపుణుల కమిటీలు వేర్వేరుగా పరిశీలన చేసి నివేదికలు ఇవ్వాలని ఈ నెల 11వ తేదీన ఆదేశించింది. కలెక్టర్లు ఇసుక రీచ్‌లను సందర్శించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆధారాలతో కోర్టుకు నివేదించాలి. అయితే ఈ నివేదికలు ఎలా ఉండాలన్నదానిపై జగన్ ప్రభుత్వానికి ఓ స్పష్టత ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్జీటీకి 26 జిల్లాలకుగాను 23 జిల్లాల కలెక్టర్లు ఒకే ఫార్మాట్‌లో నివేదిక ఇచ్చారు. తాము తనిఖీ చేసిన ఇసుక రీచ్‌ల్లో ఇంతకు ముందు మైనింగ్ చేసిన ఆనవాళ్లు లేవని.. ఇప్పుడు ఇసుక తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు లేవని.. భారీ యంత్రాలను ఉపయోగించలేదని వారు పేర్కొన్నారు. మిగతా మూడు జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో ఇసుక రీచ్‌లే లేవని నివే దించారు.