వైద్య విద్యను అభ్యసించేందుకు కిర్గిస్థాన్ వెళ్లిన భారతీయ విద్యార్థులు అక్కడ వారం రోజులుగా నిద్రాహారాలు కరువై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విదేశీ విద్యార్థులున్న విద్యా సంస్థలు, హాస్టళ్లపై అక్కడి పౌరులు కొందరు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో వారు హాస్టళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లోని యూనివర్సిటీలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు చదువుకుంటున్నారు. సాయంత్రం ఆరు గంటలైతే గదుల్లో లైట్లు ఆర్పేసి గడపాల్సిన పరిస్థితి నెలకొందని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం నాగయ్యపేటకు చెందిన బి వినయ్ కుమార్‌రాజు తెలిపారు. మంగళవారం ఆయన ఫోన్ ద్వారా దేవరాపల్లి విలేకరులతో మాట్లాడాడు. ఈ నెల 13వ తేదీ రాత్రి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు విదేశీ విద్యార్థులను వేధించడం మొదలుపెట్టారని, తాము ఉంటున్న ప్రాంతంలో పలు హాస్టళ్లలో చొరబడి డబ్బులు, వస్తువులు తీసుకుపోయారని తెలిపారు. అల్లర్ల నేపథ్యంలో ఈ నెల 19న పాకిస్థాన్‌కు చెందిన 180 మంది విద్యార్థులను ప్రత్యేక విమానంలో బిష్కెక్ నుంచి తరలించినట్టు చెప్పారు. ‘‘ఇక్కడ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. స్వదేశానికి వచ్చేయాలని ఉంది. అయితే జూన్ 15తో విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఒక వారం తర్వాత ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఇక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడి విద్యార్థుల భద్రతపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి’’ అని వినయ్ కుమార్‌రాజు వేడుకున్నారు.