రానున్న ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కి 175 చోట్ల ఘన విజయం సాధిస్తుందని, జూన్ 9న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్టణంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ తరఫున గతంలోనే చెప్పానని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. విద్యా, వైద్యం రంగాలకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంస్కరణలను ఇంకా కొనసాగిస్తామని వైయస్ఆర్సీపీ మేనిఫెస్టోలోనే పెట్టామని, మళ్లీ అధికారంలోకి రాగానే అలాగే వాటి అమలును కొనసాగిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పచ్చమీడియా పత్రిక ఆంధ్రజ్యోతిలో నిన్న విద్యాశాఖ గురించి మళ్ళీ రాసిందని, మరి, విద్యావైద్యంలో తాము అమలు చేసిన విధానాలు బాగోనప్పుడు ప్రతిపక్ష పార్టీలైన కూటమి ఏమైనా ప్రశ్నించిందా ..? మేమొస్తే ఇలా చేస్తామని మేనిఫెస్టోలో వాళ్లెందుకు పెట్టలేదు..? మా విధానాల్లో లోపాలుంటే వాటిని సరిచేస్తామని వాళ్లు చెప్పొచ్చుకదా..? ప్రజలకు మీరెందుకు క్లారిటీగా చెప్పలేదు..? అని ప్రశ్నించారు.