మూడో ప్రపంచ యుద్ధం గురించి దశాబ్దాలుగా ఊహాగానాలు, చర్చ జరుగుతూనే ఉంది. రెండు ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన వినాశనం, నష్టాలు, చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రపంచాన్ని పీడకలలా వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం అన్న ఆలోచనే అత్యంత భయానకమైంది. నోస్ట్రాడమస్, బాబా వంగాతో సహా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చాలా మంది జ్యోతిష్కులు దీని గురించి అంచనాలు వేశారు కానీ వచ్చే అవకాశంపై అనిశ్చితి ఉంది. అయినప్పటికీ, ఎప్పటికప్పుడు ఇలాంటి అంచనాల గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. చాలా మంది దృష్టిని ఆకర్షిస్తాయి.
తాజాగా, మూడో ప్రపంచ యుద్ధం గురించి భారతీయ జ్యోతిషుడు అంచనాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. హరియాణాలోని పంచకులకు చెందిన ప్రముఖ జ్యోతిషుడు కుశాల్ కుమార్.. తన అంచనాలను లింక్డిన్ పోస్ట్‌లో షేర్ చేశారు. మూడో ప్రపంచ యుద్దం మరో మూడు వారాల దూరమే ఉందని ఆయన చెప్పడం గమనార్హం. గ్రహాల గమనం, స్థితి ఆధారంగా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలపై ఈ వేద జ్యోతిషుడు జోస్యం చెబుతుంటారు.
‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాట్‌స్పాట్‌లలో యుద్ధ పరిస్థితులకు సంబంధించి 2024 ఏడాదిలో చాలా ఆందోళనకరంగా ఉంటుందని అంచనా వేశాం.. ముఖ్యంగా మే 8 నాటికి కొరియా ద్వీపకల్పం, చైనా-తైవాన్, ఇజ్రాయేల్ సహా ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు, ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో ఉద్రిక్తతలు, నాటో దేశాల్లో పరిస్థితులు తీవ్రతరంగా ఉన్నాయి.. కొందరు దేశాధినేతలకు ఈ పరిణామాలను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది.. కొందరు తీవ్ర ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది లేదా రాజీనామా కూడా చేయవచ్చు.. రాజకీయ రంగంలో ఒడిదొడుకులను తోసిపుచ్చలేం.. గ్రహాల కదలికలను బట్టి క్లుప్తంగా చెప్పాలంటే సైన్యం మొత్తం నియంత్రణలోకి వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి’ అని అన్నారు.
ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని, ఆరంభమయ్యే తేదీ కూడా ఇదేనని ఆయన చెప్పారు. ‘జూన్ 18, 2024 మంగళవారం నాడు గ్రహాల బలమైన ఉద్దీపన మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రేరిపించేందుకు ఆస్కారం ఉంది... అయితే జూన్ 10, 29న కూడా ఇది జరిగే అవకాశం ఉంది’ అని ఆయన తన కథనంలో తెలిపారు. కుశాల్ కుమార్ తనను తాను ప్రపంచ సంఘటనలను అంచనా వేసే జ్యోతిష్కుడిగా చెప్పుకోవడంతో ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. యుద్ధం చెలరేగినప్పుడు ఏమి నిల్వ చేసుకోవాలని తెలియజేసే వెబ్‌సైట్‌ను యూకే అధికారులు ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ జోస్యం చెప్పడం చెప్పుకోదగ్గ అంశం.