నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా బలపడి మే 25 నాటికి తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మే 26 నాటికి తీవ్ర తుఫానుగా బలపడి.. పశ్చిమ్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరానికి చేరువుగా వస్తుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ తుఫాను ‘రెమల్’గా నామకరణం చేశారు. ఆదివారం సాయంత్రం బెంగాల్, బంగ్లా మధ్య రెమల్ తుఫాను తీరం దాటుతుందని, దీని ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
‘‘బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారుతుంది.. ఇది శనివారం ఉదయం తుఫానుగా మరింత బలపడి ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారనుంది.. బంగ్లాదేశ్.. దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ్ బెంగాల్ తీరానికి చేరుకుంటుంది’ ఐఎండీ శాస్త్రవేత్త మోనికా శర్మ తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులంతా తిరిగి రావాలని సూచించారు.
మే 27 వరకు బంగాళాఖాతంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. 26-27 తేదీల్లో పశ్చిమ్ బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరం, త్రిపుర, దక్షిణ మణిపూర్‌లోని కొన్ని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరొకన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతపవనాలకు ముందు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తొలి తుఫాను ఇదే.
మరోవైపు, నైరుతు రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు ఐఎండీ తెలిపింది. అండమాన్, నికోబార్, కొమరిన్ దీవుల వరకూ రుతుపవనాలు విస్తరించాయని.. బంగాాళాఖాతంలో అనుకూల వాతావరణం ఉందని పేర్కొంది. దీంతో అనుకున్న సమయానికే మే 31 లోపు కేరళ తీరానికి రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.