ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అసైన్డ్ భూములను సీఎస్ జవహర్ రెడ్డి కొట్టేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే ఆయన విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారని విమర్శించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ ఆసైన్డ్ భూములు ఎక్కువుగా ఉన్నాయన్నారు. భూముల మార్పిడి జీవో 596.. ఆ జీవో ఆధారంగా భూములు కొట్టేశారని ఆరోపించారు. ఆయన కుమారుడిని బినామీగా పెట్టి 800 ఎకరాలకు పైగా భూముల డీల్స్ చేశారని విమర్శించారు. ఎన్నికల ముందే అడ్వాన్సులు తీసుకున్న అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్లు ఇప్పుడు చకచకా జరిగిపోతున్నాయని ఆరోపణలు చేశారు. మిగతావి త్వరగా చేయాలని అధికారుల మీద సీఎస్ జవహర్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని రిజీస్ట్ర్రేషన్స్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, సీబీఐ విచారణ జరిపించాలని పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు.