ఏపీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడం, ప్రస్తుత హింసాత్మక ఘటనల నేపథ్యంలో జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు రానున్నారు. పలు జిల్లాల్లో పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ముందస్తు చర్యగా ఉన్నతాధికారులను నియమించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా శనివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మంది పోలీస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఈ రోజు (శనివారం) సాయంత్రంలోగా ఆయా జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని ప్రత్యేక పోలీస్ అధికారులకు డీజీపీ సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లో శాంతిభద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ఏపీ డీజీపీ ఆదేశించారు. పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులను కేటాయించారు. పల్నాడుకు కేటాయించిన అధికారుల్లో ఆరుగురు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు ఉన్నారు. కాగా ఏపీ ఎన్నికలకు జరిగిన పోలింగ్, ఆ తర్వాత రాష్ట్రంలోని పల్నాడు, నర్సారావుపేట, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో కౌటింగ్‌ను ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఇందులో భాగంగానే భారీగా పోలీసు అధికారులను నియమించినట్లు తెలుస్తోంది.