గన్నవరం విమానాశ్రయం నుంచి ఈ ఏడాది పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు హజ్‌కమిటీ సభ్యులు పేర్కొన్నారు. స్థానిక ఈద్గా జామా మసీదులో ఏర్పాటుచేసిన హజ్ క్యాంపులో వక్ఫ్‌బోర్డ్ సీఈవో, హజ్ కమిటీ ఈవో అబ్దుల్ ఖదీర్ అధ్యక్షతన శుక్రవారం హజ్‌కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు, దూదేకుల కార్పొరేషన్ ఎండీ గౌస్ పీర్, డైరెక్టర్ ఉర్దూ అకాడమీ, సీఆర్డీఏ అదనపు కమిషనర్ అలీమ్ బాషా తదితరులు హజ్ క్యాంపులో యాత్రీకులకు చేయవలసిన ఏర్పాట్లగురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వివిధ జిల్లాల నుంచి హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికులు ఈనెల 25వతేదీ (శనివారం)నుంచి క్యాంపునకు వస్తారని అన్నారు. క్యాంపులో నిరంతర తాగునీటి సరఫరా, అంతరాయంలేని విద్యుత్ సరఫరా వుండాలని, క్యాంపు ఆవరణ శుభ్రంగా వుండేలా శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే వైద్యసిబ్బందితో మెడికల్ క్యాంపు ఏర్పాటుచేయాలన్నారు. ఈఏడాది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి 692 మంది హజ్ యాత్ర చేయనున్నారని, ఈనెల 27, 28, 29తేదీల్లో గన్నవరం విమానాశ్రయంనుంచి మూడు విమానాల్లో హజ్ యాత్రకు వీరు బయలుదేరతారని తెలిపారు. మొదటి విమానం ఈనెల 27వతేదీ సోమవారం ఉదయం 8.45గంటలకు 322మందితో బయలుదేరుతుందని, రెండవ విమానం ఈనెల 28 సాయంత్రం 4.55గంటలకు 322మంది, మూడవది ఈనెల 29 మధ్యాహ్నం 2.50గంటలకు 48మందితో బయలుదేరతాయన్నారు. విమానం బయలుదేరు సమయానికి 6గంటల ముందుగా గన్నవరం విమానాశ్రయంలో యాత్రికులు రిపోర్టు చేయవలసి వుంటుందన్నారు. క్యాంపు నుంచి విమానాశ్రయానికి వెళ్లేందుకు యాత్రికులకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. సమావేశంలో డీపీవో నాగేశ్వరనాయక్, జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి షంసున్నీసా బేగం, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్య, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.