కృష్ణా జిల్లాలో ఈనెల 13న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరపాల్సి వున్నందున ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలను అనుసరించి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాలను ఈనెల 31వ తేదీ నాటికి సిద్ధం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు, పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. కలెక్టర్, సీపీ, జేసీ, మైలవరం ఆర్వో పి.సంపత్‌కుమార్, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులతో కలిసి ఇబ్రహీంపట్నం, జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలల్లో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఈనెల 31 నాటికి కౌంటింగ్ కేంద్రాల్లో 100 శాతం పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, సూక్ష్మ పరిశీలన, సీసీ కెమేరాల నిఘా మధ్య ప్రక్రియను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు తదితరులకు అల్పాహారం, భోజనం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయనున్నట్టు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి నిబంధనల మేరకు మొబైల్ ఫోన్లకు అనుమతి లేనందున నియోజకవర్గాల వారీగా మొబైల్‌ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్‌లను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.