కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ రేంజ్‌లో వణికించిందో మనం ప్రత్యక్షంగా చూశాం. అయితే ఈ కరోనా మహమ్మారి చైనాలో పుట్టిందని ఇప్పటికే ఎన్నో నివేదికలు తేల్చాయి. ఇప్పుడిప్పుడే ఆ వైరస్ బారినుంచి బయటపడుతుండగా.. తాజాగా మరో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. చైనా శాస్త్రవేత్తలు మరో ప్రాణాంతక వైరస్‌ను తయారు చేసినట్లు తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ వైరస్ సోకితే కేవలం 3 రోజుల్లోనే మరణం సంభవిస్తుందని తెలుస్తోంది. ఈ విషయం బయటికి రావడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. చైనాలోని హెబీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ కొత్త వైరస్‌ను సృష్టించారు. ఎబోలా వైరస్ లాగానే ఈ కొత్త వైరస్ కూడా చాలా ప్రమాదకరమైందని.. ఇది మనిషిని కేవలం 3 రోజుల్లోనే చంపేస్తుందని ఆ నివేదికలు చెబుతున్నాయి.
వ్యాధికారక ప్రభావాలను అధ్యయనం చేసేందుకే చైనా శాస్త్రవేత్తలు ఈ వైరస్ సృష్టించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ వైరస్ ప్రయోజనాలు, ప్రమాదాలపై సర్వత్రా తీవ్ర చర్చ జరుగుతోంది. చైనా శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ వైరస్ స్వభావం సింథటిక్ అని సమాచారం. చైనా సైంటిస్ట్‌లు చేసిన ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక సైన్స్ డైరెక్ట్‌లో ప్రచురితం కావడంతో ప్రపంచానికి తెలిసింది.
ఎబోలా వైరస్‌ను ఉపయోగించి ఈ కొత్త వైరస్‌ను సృష్టించారు. ఇక దీనిపై సాగిస్తున్న పరిశోధన సర్వత్రా తీవ్ర వివాదాస్పదంగా మారింది. అయితే ఈ పరిశోధన ఉద్దేశ్యం వివిధ వ్యాధులను నివారించడం.. ఆ వ్యాధుల లక్షణాలను పరిశోధించడం అని చైనా శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. ఈ వైరస్ మనిషి శరీరంపై ఎబోలా లాంటి ప్రభావాన్నే చూపుతుందని.. పేర్కొన్నారు. పరిశోధకుల బృందం ఎబోలా వైరస్ నుంచి.. గ్లైకోప్రొటీన్ (జీపీ)ని స్వీకరించేందుకు వెసిక్యులర్ స్టోమాటిటిస్ వైరస్ (వీఎస్‌వీ)ని ఉపయోగించినట్లు సైన్స్ డైరెక్ట్‌లో ప్రచురించారు.
ఈ వైరస్‌ను శాస్త్రవేత్తలు సిరియన్ హామ్స్టర్స్ అనే జంతు జాతుల సమూహంపై పరీక్షించారు. వీటిలో ఐదు మగ, ఐదు ఆడ జాతులు ఉన్నాయి. ఈ జంతువులకు ఈ కొత్త వైరస్‌ను ఎక్కించగా.. వాటిలో ఎబోలా వైరస్ లాంటి లక్షణాలు కనిపించాయని పేర్కొన్నారు. అయితే వైరస్‌ను ఎక్కించిన 3 రోజుల్లోనే ఆ జంతు సమూహాలు అన్నీ మృతి చెందాయని ఆ నివేదికలో పొందుపరిచారు. ఈ వైరస్ ఎక్కించిన తర్వాత కొన్ని జంతువుల కళ్లు దెబ్బతిన్నాయని.. ఆప్టిక్ నరాలపై తీవ్ర ప్రభావం కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. కాగా 2014 నుంచి 2016 మధ్య కాలంలో ఆఫ్రికన్ దేశాలలో ఎబోలా వ్యాప్తి చెందగా.. ఆ వైరస్ బారిన పడి వేలాది మంది మృత్యువాత పడటం సంచలనం రేపింది.