కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాపులపాడు మండలం కోడూరుపాడు సమీపంలో ఉనక్న హెచ్‌పీ పెట్రోల్ బంక్ దగ్గర లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కారు ఏలూరు నుంచి విజయవాడ వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నిద్రమత్తు ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు .. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వద్ద నేషనల్ హైవేపై ఆదివారం రాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా.. కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ, తీవ్రగాయాలతో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. కాకినాడ నుంచి విజయనగరానికి ఇద్దరు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మరోవైపు తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు చనిపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి దగ్గర పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.