సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కీలక దశకు చేరుకున్నామని, అందరూ అంకితభావంతో పనిచేసి కౌంటింగ్‌ను సమర్థవంతంగా పూర్తి చేద్దామని రాజమహేంద్రవరం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కే మాధవీలత సూచించారు. జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం ఎన్నికల కౌంటింగ్ విధులు, బాధ్యతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడంలో ప్రతి ఒక్కరు వారికి కేటాయించిన విధులు నిర్వహించే క్రమంలో నిబద్దతతో, క్రమశిక్షణతో పూర్తిచేయాలన్నారు. ఇప్పటికే ఎవరెవరు ఏఏ విధులు నిర్వ హించాలో ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ఇప్పటివరకు సమర్థవంతంగా విధులు నిర్వహించిన వారిని అభినందించారు. ఇకపై కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు ఆదే స్ఫూర్తితో పనిచేయాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌పై చేపట్టవలసిన వాటిపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పరిపాలన భవనం రెండో అంతస్తు లో పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్ ఓట్లు లెక్కింపు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 50 చొప్పున పోస్టల్ బ్యాలెట్ బండిల్స్ ఏర్పాటు, 14 ప్లస్ 4 టేబుల్స్ ద్వారా అభ్యర్థుల వారీగా లెక్కింపు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సీలింగ్ వరకూ ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది హాజరు నమోదు, గుర్తింపు కార్డుల జారీ, ఇతర అనుబంధ ఏర్పాట్లు, నివేధికలు, రౌండ్ వారీగా ఫలితాల ప్రకటన కోసం ఎవరు ఏ విధులు చేపట్టాలో సమగ్రంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అదేవిధంగా ఈవీఎమ్ యూనిట్స్‌లలో పోలైన ఓట్లు లెక్కింపు కోసం నిర్థిష్టమైన కార్యాచరణ ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల ద్వారా విధులను కేటాయించినట్టు ఆమె తెలిపారు. విధులు నిర్వర్తించడంలో ఆయా శాఖల అధికారులు వారి సిబ్బందితో కూడిన ముందస్తు చర్యలు తీసుకోవాలని మాధవీలత ఆదేశించారు.