దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. చిన్నా, పెద్దా, ముసలి ఎవరు చూసినా.. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే శనివారం చివరి విడత ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే.. ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా ఎవరు గెలుస్తారు అనే దానిపై ఒక స్పష్టత రానుంది. అయితే అవే నిజం అవుతాయని కాకపోయినా.. ఎవరికి మెజార్టీ వస్తుంది.. ఎవరు గెలవబోతున్నారు అనే దానిపై ఒక అంచనాకు రావచ్చు. అయితే జూన్ 4 వ తేదీన లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే తాజాగా జూన్ 4 వ తేదీన వెల్లడి కానున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సినిమా థియేటర్లలో ప్రసారం చేయనున్నారు. ఇందుకోసం బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు.
జూన్ 4 వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల కోసం, ఓట్ల లెక్కింపు కోసం.. దేశవ్యాప్తంగా జనాలు.. దేశం టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతూ ఉంటారు. అయితే ఈ ఎన్నికల ఫలితాలు సినిమా థియేటర్లలో ప్రసారం చేసేందుకు మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ఏర్పాట్లు చేశాయి. దీంతో వీటి కోసం ఇప్పటికే ఆ లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రసారాలకు సంబంధించి.. టికెట్ బుకింగ్‌లను ఆయా థియేటర్లు ప్రారంభించాయి.
ముంబైలోని ఎస్‌ఎం5 కల్యాణ్, సియాన్.. కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్ థియేటర్లు.. థానేని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్.. నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్ ఎటర్నిటీ, పుణెలోని మూవీమ్యాక్స్ తదితర థియేటర్లు ఈ అవకాశాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలోనే జూన్ 4 వ తేదీన ఎన్నికల ఫలితాలను బిగ్ స్క్రీన్‌పై ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే పేటీఎం వంటి ప్లాట్‌ఫామ్‌లలో బుకింగ్స్‌ను ప్రారంభించాయి.
ఇక జూన్ 4 వ తేదీన ఎన్నికల ఫలితాలను 6 గంటల పాటు థియేటర్లలో లైవ్ స్ట్రీమ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రిజల్ట్స్ కోసం టికెట్ ధరలను రూ.99 నుంచి రూ.300 వరకు ఉన్నాయని థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని థియేటర్లలో టికెట్లు అన్నీ అమ్ముడుపోయి హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టినట్లు తెలుస్తోంది. టికెట్ బుకింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.